cm kcr review on Nalgonda: నల్గొండ పట్టణ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆదేశించిన పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో 'నల్లగొండ కళాభారతి ' సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. దాదాపు 2000 మంది కూర్చునే సామర్థ్యంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే తండ్రి నర్సింహ మృతి చెందగా.. దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. నార్కట్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు.
పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్‌ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్స్ నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫొటోలు, నివేదికల ద్వారా పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలించారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి పనుల పురోగతిని వివరించారు.
ప్రజలు కుటుంబంతో కలసి మార్కెట్‌కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్‌ను ఏర్పాటు చేయాలనీ సీఎం ఆదేశించారు. పట్టణంలో వీలైన చోటల్లా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివరించారు.
సాగర్ అభివృద్ధిపై ఆరా: అదే సమయంలో నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్‌తో పాటు ఆలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్‌ను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్యే పూర్తయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీటికి సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులైందని.. పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు.
నల్గొండ మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, పట్టణంలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ ఎండ్ బి గెస్ట్ హౌస్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ ఆఫీసుల నిర్మాణాలను సీఎం మంజూరు చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి నిర్మాణానికి సంబంధించిన జీవోలు జారీ చేయాలన్నారు. ఆరు నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. అదే విధంగా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ఫోన్లో ఆదేశించారు.
మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ మందాడి సైది రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు.
ఇవీ చూడండి..
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్
జవాన్ పెళ్లి కోసం స్పెషల్ హెలికాప్టర్.. దటీజ్ ఇండియన్ ఆర్మీ!