రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తామనడం కేంద్రం ముందు సీఎం కేసీఆర్ తలవంచినట్లేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో 'పొలం బాట- పోరు బాట' కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఎందుకు మాట్లాటడం లేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. నూతన సాగు చట్టాల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనడం నిలిపివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్