నాగార్జున సాగర్ డ్యాం క్రస్టుగేట్లను మూసివేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీరు 42,338 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 306.10 టీఎంసీలు, నీటిమట్టం 588.00 అడుగుల వద్ద ఉంది. గత నాలుగు రోజుల్లో డ్యాం క్రస్టుగేట్ల ద్వారా సుమారు 65 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
డిసెంబరు నాటికి సాగర్ 8వ యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి
నాగార్జునసాగర్ ఎడమగట్టు విద్యుత్కేంద్రంలోని జనవరిలో నిలిచిపోయిన 8వ యూనిట్ మరమ్మతు పనులు పూర్తిచేసి డిసెంబరు కల్లా ఉత్పత్తిని మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని జెన్‌కో సీఈ సూర్యనారాయణ ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు సోమవారం వెల్లడించారు. సాగర్‌లో ఉన్న మొత్తం 8 యూనిట్ల నుంచి 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇటీవల మూడో యూనిట్‌లో సర్వీసు సమస్యలు తలెత్తడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీని మరమ్మతు పనులు వారం కిందట పూర్తి చేశారు. ఇప్పుడు విద్యుదుత్పత్తి జరుగుతోంది. 8వ యూనిట్ డిసెంబరు నాటికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం సాగర్‌కు వరద పోటు ఉన్న నేపథ్యంలో గరిష్ఠ స్థాయిలో జల విద్యుదుత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చూడండి : నాన్నను రెండు వారాల తర్వాత కలిశాను: ఎస్పీ చరణ్