Chervugattu Kalyanam: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం ఆదివారం తెల్లవారుజామున నయనానందకరంగా, భక్త జనుల శివనామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుడి కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఘట్టాన్ని శైవశాస్త్రానుసారం చూడముచ్చటగా నిర్వహించారు.
పల్లకి ఊరేగింపుతో సేనతో కల్యాణమండపానికి శివపార్వతులను తోడ్కోని వచ్చి రంగురంగుల రకరకాల పూలు, విద్యుత్ దీపాలంకరణలు, పచ్చని తోరణాలతో అలంకరించిన కల్యాణ మండపంలో ఆశీనులు కావించారు. పట్టువస్త్రాలు, పూలమాలాంకృతులైన వధూవరులు శివపార్వతులను ముస్తాబు చేసి కల్యాణఘట్టాన్ని రమణీయంగా నిర్వహించారు.
ఆలయ ప్రధానార్చకులు పోతుల పాటి రామలింగేశ్వర శర్మ సారథ్యంలోని అర్చక బృందం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని శాస్త్రయుక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల హరహర మహాదేశ, శంభోశంకర నామస్మరణాల మధ్య జరిపించారు. శివ పార్వతుల మంగల్య ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్త జనం భక్తిపావవశ్యాలతో పులకరించారు. అనంతరం తలంభ్రాలధారణ ఘట్టం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
పార్వతి జడల రామలింగేశ్వరుల కల్యాణోత్సవం పిదప స్వామిఅమ్మవార్లకు వేలాది మంది భక్తులు ఒడి బియ్యం సమర్పించారు. స్వామివారికి పాదుక మొక్కులను సమర్పించడంలో భక్తులు పోటీ పడ్డారు. కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ అడుగడున భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కల్యాణోత్సవంలో స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య,అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చదవండి: