నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం ఊపుగా సాగుతోంది. ఇప్పటికే పార్టీల అగ్రశ్రేణి నేతలు ప్రచారంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకోవడమే ధ్యేయంగా గడపగడపా తిరుగుతున్నారు.
నామినేషన్లు వేయగానే ప్రచార రథం ఎక్కిన నోముల భగత్ ఇప్పటికే రోడ్‌షోలతో ప్రచారం చేస్తూ దూసుకుపోతుండగా భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్ కూడా ప్రచారాన్ని వేగంగానే మొదలెట్టారు. ఇప్పటికే ఒక రౌండు నియోజకవర్గం అన్ని గ్రామాలు తిరిగిన కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు జానారెడ్డి మాత్రం నామినేషన్ల తర్వాత ఇంకా రోడ్‌షోలు ప్రారంభించలేదు.
మండల ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే వారితో గ్రామస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మండలాల్లో ఆ పార్టీ నాయకులు గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రచారంలో వెనకపడకుండా చూసుకుంటున్నారు. మండలాలకు నియమించిన ఇన్‌ఛార్జిలు రంగంలోకి దిగడంతో మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రచారం కూడా ఊపందుకునే అవకాశం ఉంది. తెదేపా కూడా ప్రచారంలో కీలకంగానే వ్యవహరిస్తోంది.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ ఉపపోరులో మహిళా ఓటర్లే కీలకం