కరోనాను జయించి విధుల్లో చేరుతున్న పోలీసులకు నల్గొండ జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా రెండు రకాలుగా వస్తుందని దగ్గు, జలుబు, జ్వరంలాంటి లక్షణాలతో కూడిన పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాల ప్రకారం చికిత్స చేయించుకోవాలన్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి వైరస్ బలహీనపడుతుందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు తమ శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా చికిత్స పొందాలని, కరోనా సోకిన తర్వాత ఐదు నుంచి పన్నెండు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎలాంటి లక్షణాలు లేని వారు సైతం కొవిడ్-19 బారిన పడుతున్నారని.. అలాంటి వారు కనీసం 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ పాటించడం మంచిదని పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడి.. తిరిగి కోలుకున్నారని ఎస్పీ తెలిపారు. రాబోయే రెండు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కరోనాను జయించి విధుల్లో చేరిన పోలీసులను ఎస్పీ యుద్ధంలో గెలిచిన వీరులతో పోల్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, ఏఆర్ డిఎస్పీ సురేష్ కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.