BJP Leaders Munugode Bypoll Campaign: మునుగోడు ఉప పోరులో ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు కాషాయదళం సిద్ధమైంది. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోన్న కమలనాథులు.. మరింత వేగవంతం చేయనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్షణ్.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. డీకే అరుణ, వివేక్, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ సైతం ప్రచార రంగంలోకి దిగారు. ఇక కాషాయ దళపతి బండి సంజయ్ రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగి 12 రోజుల పాటు రోడ్ షోలతో కదం తొక్కనున్నారు.
ఇన్ని రోజులు దిల్లీ పర్యటనలో ఉండటంతో ఆయన రాలేకపోయారు. రేపటి నుంచి మునుగోడులో మకాం వేసి తనదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అధికార పార్టీ తెరాస.. మునుగోడుకు చేసిందేమిటి? ఎన్ని నిధులిచ్చింది? అనే అంశాలను ప్రజలకు వివరించనున్నారు. ఓటర్లను చైతన్యవంతుల్ని చేసి కాషాయ పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను భాజపాలో చేర్చుకొని.. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించాలనే లక్ష్యంతో బండి సంజయ్ ఉన్నారు.
ఈ నెల చివరి వారంలో కాషాయదళం రాకెట్ వేగంతో ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర మంత్రులు, దిల్లీ అగ్ర నేతలతో వరుసగా సభలు నిర్వహించి ఓటర్లను తమ వైపునకు లాక్కోవాలని భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నెలాఖరులో ప్రచార పర్వం చివరి రోజున భారీ సభలు నిర్వహించాలని కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ నాయకులతో పాటు.. కేంద్రమంత్రులను కూడా తీసుకువచ్చేందుకు కాషాయదళం ప్రణాళిక రచిస్తోంది.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. కేంద్రమంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. వారి షెడ్యూల్‌కు అనుగుణంగా.. సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 27న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్య అతిథిగా తీసుకువచ్చి.. సభ నిర్వహించాలని కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఆ రోజు నడ్డా షెడ్యూల్ బిజీగా ఉంటే.. మరుసటి రోజు సభ నిర్వహించేలా ముందుకెళ్తున్నారు.
ఇక ప్రచార పర్వం చివరి రోజైన నవంబర్ 1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రచారానికి రానున్నారు. మునుగోడు ఉపఎన్నికను భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారానికి రావాలని రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అయితే ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారవ్వలేదు. మరికొద్ది రోజుల్లో ఆయన రాకపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: