munugode by election: డబ్బును ఒక చోటు నుంచి మరో చోటుకి పరిమితి ప్రకారం తీసుకెళ్లడం చట్టప్రకారం అక్రమం కాదు. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నగదు, బంగారం భారీ మొత్తంలో తీసుకెళ్లొద్దు. సొంత డబ్బయినా లెక్క చూపాల్సిందే, నా సొమ్మే కదా నాకేం అనుకుంటే అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కొంత పరిమితిని నిర్దేశించింది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సరైన ఆధారాలు చూపించాలి. లేదంటే అంతే సంగతులు. ఎన్నికలే కాదు, ఏ సమయంలోనైనా నిబంధనల ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతులు లేవు.
నగదు వెనక్కి తీసుకోవడం కష్టమే: మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా ప్రత్యేక చెక్‌పోస్టులు వెలిశాయి. వీటి వద్ద రెవెన్యూ, పోలీసుశాఖ అధికారుల, సిబ్బంది ఉంటారు. ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. ఆదాయ పన్ను శాఖకు జప్తు చేస్తారు. అక్కడి నుంచి నగదు పొందాలంటే కష్టం. ఆధారాలు, వివరణ సరిగా లేకపోతే 30 శాతం పన్ను కింద తీసుకొని మిగతాది ఇస్తారు.
ఈ నిబంధనలు తెలియక చాలా మంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ చెక్‌పోస్టుల వద్ద దొరుకుతున్నారు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 69-ఏ ప్రకారం ఏ వ్యక్తి అయినా తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉంటే వాటికి ఆధారం చూపించాలి. సరైన వివరణ ఇవ్వాలని ఎన్నికల విభాగ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించడం తప్పనిసరి.
బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే: రూ.50 వేలు దాటితే ఆధారాలు అవసరం. సెల్ఫ్ చెక్ ద్వారా అయితే, ఆ చెక్ నకలు కాపీ, ఏటీఎం ద్వారా తీసుకుంటే మిషన్ ద్వారా వచ్చిన స్లిప్, డబ్బులు విత్‌డ్రా చేస్తే బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్ స్లిప్పు వెంట ఉంచుకోవాలి. అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నట్లుగా వ్యక్తిగత డిక్లరేషన్, బ్యాంకు ఖాతా పుస్తకం నకలు కాపీ ఉండాలి.
కలెక్షన్ ఏజెంట్: ఆ రోజు చేయాల్సి కలెక్షన్ పద్దుల పట్టిక, బాకీ ఉన్న మొత్తం, ఆ రోజు ఇచ్చిన వారి సంతకం తదితర వివరాలు ఉండాలి. ఆసుపత్రి బిల్లు కట్టడానికి ఎక్కువ మొత్తం నగదు తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో చికిత్సకు ఇంతమొత్తం ఖర్చవుతుందని తెలిపే బిల్లు, అదికాకపోతే ఎస్టిమేషన్ కాపీ చూపించాలి.
అప్పు తీసుకుంటే: అవసర నిమిత్తం రూ.లక్షల్లో అప్పుగా తీసుకుంటారు. వాటిని తీసుకెళ్తున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి రాయించుకున్న ప్రామిసరీ నోటు నకలు వెంట తీసుకెళ్లాలి. ప్రస్తుతం ఖరీఫ్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. మార్కెట్‌లో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నగదు తీసుకెళ్లే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అమ్మకం పట్టీ దగ్గర ఉంచుకోవాలి.
ఇవీ చదవండి: