Munugode by election: మునుగోడు ఉపఎన్నిక రసకందాయంగా మారింది. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉపఎన్నికపైనే అందరి దృష్టీ నెలకొంది. పార్టీలు, అభ్యర్థులు, నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. ఓటరు మహాశయుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల విద్యలను ప్రదర్శిస్తున్నారు. ప్రలోభాల పర్వం ఇప్పటికే జోరుగా కొనసాగుతోంది.
కొత్త కొత్త విధానాలు, వ్యూహాల ద్వారా ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకలను చేరవేస్తున్నారు. ఇందుకోసం అన్ని అవకాశాలు, సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ప్రలోభాలకు జోరుగా కొనసాగుతుండడంతో పాటు ఫిర్యాదులు కూడా భారీగా వస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. అదనపు వ్యయపరిశీలకుణ్ని మునుగోడు నియోజకవర్గానికి పంపింది.
ఆదాయపు పన్ను శాఖ కూడా ఏడుగురు అధికారులకు అదనంగా బాధ్యతలు అప్పగించింది. వ్యయపరిశీలకులకు సాయపడడంతో పాటు నియోజకవర్గంలో అక్రమంగా నగదు లావాదేవీల నియంత్రణపై వీరు దృష్టి సారిస్తారు. ఫిర్యాదుల కోసం 08682 230198 టోల్ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్‌కు మాత్రం ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు రాలేదని అధికారులు అంటున్నారు.
మీడియాలో వస్తున్న కథనాలు, నియోజకవర్గంలో జరుగుతున్న హడావుడిని చూసి అదనపు చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు అందని నేపథ్యంలో సిబ్బంది అడిగి మరీ వాకబు చేసే పనికి అధికారులు శ్రీకారం చుట్టారు. 14 మంది బృందంలో నలుగురిని వచ్చే ఫిర్యాదుల కోసం కేటాయించారు.
మిగిలిన పది మంది అన్ని మండలాల్లోని ఓటర్లకు ర్యాండమ్‌గా ఫోన్ చేసి మరీ వివరాలు సేకరించే పనిని అప్పగించారు. నిబంధనల ఉల్లంఘనతో పాటు ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఉంటే సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ వర్గాలు చెప్తున్నాయి.
చెక్‌పోస్టుల వద్ద కొన్ని వాహనాలను మాత్రమే తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడున్న వీడియో కెమెరాల ఫీడ్‌ను లైవ్‌గా వీక్షించే ఏర్పాట్లు చేశారు. నల్గొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వాటన్నింటినీ అనుసంధానించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరపు వ్యక్తులు అక్కణ్ణుంచి అన్ని చెక్ పోస్టుల వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే వెసులుబాటు కల్పించారు.
అటు చాలా వరకు మెయిల్స్ ద్వారానే రాజకీయపార్టీలు, అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా, రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. వాటన్నింటిపై ఎప్పటికప్పుడు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 19 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: