అమ్మ ప్రేమ విలువ తెలియని ఓ ప్రబుద్ధుడు.. ఆమె ఆత్మగౌరవాన్నే మంటగలిపాడు. భర్త చనిపోయి చిన్న కుమారుడు వద్ద ఉంటున్న ఆ తల్లి పట్ల... పెద్ద కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు. రక్తందారపోసి తనని కన్నదన్న విషయాన్ని సైతం.. ఆ ప్రబుద్ధుడు మరచిపోయి... బతికున్న తల్లి చనిపోయిందని... పెద్ద కర్మ ఏర్పాటు చేశామంటూ... ఏకంగా బంధువులకు కార్డులు పంచి... తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించాడు.
![a mother complaint on son who distribute dasha dina karma cards while she was alive at nakirakal and nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13488798_son.png)
ఇదీ జరిగింది...
నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన.. వారణాసి పోషమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహలు అయ్యాయి. భర్త హనుమంతు చనిపోవటంతో... చాలా కాలంగా పోషమ్మ చిన్న కుమారుని వద్దనే ఉంటోంది. ఆస్తిని, పెన్షన్‌ను చిన్న కుమారుడికే ఇస్తోందని... తట్టుకోలేని పెద్ద కుమారుడు యాదగిరి.. తల్లి పట్ల ద్వేషం పెంచుకున్నాడు. ఆమె ఈ నెల 19న చనిపోయిందని... ఈ నెల 28న పెద్ద కర్మ అంటూ కార్డులు ముద్రించి... బంధువులకు పంపిణీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. బతికుండగానే చంపేసిన తన కుమారుడి ఘన కార్యం గురించి చెప్పుకుంటూ... కన్నీరు పెట్టుకుంది.
అమ్మ లేనిదే... ఈ సృష్టిలో జీవం లేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి.. జన్మనిస్తున్న ఆ తల్లి రుణాన్ని.. ఏమిచ్చినా తీర్చుకోలేం. అటువంటి అమ్మను, అమ్మ ప్రేమను.. గుండెల్లో పెట్టుకుని.. పూజించుకుంటూ.. ఆమెకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకోవడమే.. ఏ కన్న బిడ్డ అయినా చేయాల్సింది.