నాగార్జునసాగర్(Nagarjuna Sagar Dam) నుంచి సాగరం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ 22 గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే గేట్లు ఎత్తారు. శ్రీశైలానికి 4.41 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 4.35 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇది రెండు రోజుల నుంచి కొనసాగుతోంది. సాగర్‌లోకి 3.72లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. 587.20 అడుగుల మేర నీటి మట్టాన్ని తాకింది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు జలాశయంలో 305 టీఎంసీలను కొనసాగిస్తూ 22 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు.
అరుదుగా ముందే దిగువకు
నాగార్జునసాగర్(Nagarjuna Sagar Dam) ప్రాజెక్టు నిండగా దిగువకు కృష్ణా జలాలను వదిలిన సంఘటనలు గతంలో ఎక్కువగా ఆగస్టు రెండో వారం తరవాతే చోటుచేసుకున్నాయి. 2007లో వరదల సమయంలో ఒకసారి మాత్రం ఆగస్టు రెండో తేదీన గేట్లు తెరిచి దిగువకు వదిలారు. ఈ ఏడాది ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల పరిధిలో భారీ వర్షాలు కురవడంతో జూన్ నుంచే వరద ప్రారంభమైంది. జులై చివరి వారంలో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదల మొదలవడంతో ముందుగానే శ్రీశైలం నిండింది. దీంతో పది గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ నుంచి భారీ వరద దిగువకు వస్తుండటంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. పులిచింతల ప్రాజెక్టు గత నెలలోనే నిండగా గేట్ల ద్వారా దిగువకు నీటిని కూడా విడుదల చేశారు. ఆదివారం సాయంత్రానికి 42.72 టీఎంసీల (పూర్తి నిల్వ 45.77 టీఎంసీలు) నిల్వ ఉంది. రాత్రి 8 గంటల సమయానికి ఎగువ నుంచి వచ్చే వరద 1.12 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లు తెరిచి ప్రకాశం బ్యారేజీ వైపు నీటిని విడుదల చేస్తున్నారు.