నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గురుకులాల్లో బుధవారం కరోనా కలకలం రేపింది. రెండు గురుకులాల్లోని 15 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కొవిడ్ నిర్ధారణ అయింది. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 480 మంది విద్యార్థులు ఉన్నారు. మొదట పది మంది అనారోగ్యానికి గురవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేశారు. వారిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వైద్యాధికారిణి డా.ఉషారాణి సిబ్బందితో పాఠశాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా మరో 10 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్(10 students and 2 teachers tested corona positive) ఫలితం వచ్చింది.
కాటారంలో నలుగురికి కరోనా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు(Students tested covid positive) కరోనా సోకింది. వారం రోజుల క్రితమే పునఃప్రారంభమైన గురుకులానికి విద్యార్థులు చేరుకోగా మూడు రోజుల క్రితం జలుబు, జ్వరం బారిన పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ రాజేందర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రామారావును సంప్రదించారు. ఈ క్రమంలో పాఠశాలలోని మరో 150 మందికి ర్యాపిడ్, యాంటిజన్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడిన వారిలో ఒకరు తొమ్మిదో తరగతి, ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కాగా ఒకరు ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు ఇళ్లకు పంపారు. మిగతా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.
కొత్తగా 164 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 164 కొవిడ్ పాజిటివ్ కేసులు(corona cases in telangana today) నమోదయ్యాయి. మహమ్మారితో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు 3,969 మంది కొవిడ్‌తో కన్నుమూశారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 55, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. రాష్ట్రంలో మరో 2,15,068 మందికి కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో పరిహారం..
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాల(exgratia for corona deceased families)కు 30 రోజుల్లోగా రూ.50వేల పరిహారాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బాధిత కుటుంబ సభ్యులు పరిహారం కోసం ఆసుపత్రి జారీ చేసిన ధ్రువపత్రంతో ఆన్‌లైన్‌లో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలని సూచించింది. ఆ ధ్రువపత్రం లేని వారు చికిత్సకు సంబంధించిన పత్రాలను జత చేసి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి.. ‘కొవిడ్‌తో మరణించినట్లు ధ్రువపత్రాన్ని జారీ చేయాలి’ అంటూ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. కరోనా పరిహారం మంజూరుకు అనుమతులిస్తూ రెవెన్యూ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.