కరోనా బెడదతో రైతుల్లో ఆర్థికమాంద్యం ఏర్పడి కష్టనష్టాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో కందుల డబ్బులు ఆదుకుంటాయని అందరూ భావించారు. కానీ, ఇప్పటివరకు ఈ విషయమై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తమ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయోనని ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 7,899 మంది కంది రైతులు ఎదురు చూస్తున్నారు.
కంది రైతులు దళారుల బారిన పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మార్చి మొదటివారంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 28 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండోవిడత కంది కొనుగోళ్లను ప్రారంభించింది. మద్దతుధర వస్తుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కందులను విక్రయించారు. ఇపుడేమో అత్యవసర ఖర్చులు ఉన్నప్పటికీ డబ్బులు ఖాతాలో జమ అయ్యేవరకు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కందిరైతులకు చెల్లించాల్సిన బకాయిలు మెుత్తం రూ.58.38కోట్లు.
రూ.40.5 కోట్లు మంజూరు...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో కంది రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.40.5 కోట్లు మంజూరైనట్లు ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. మంజూరైన డబ్బులను ఈ వారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల రైతులకు రూ.12 కోట్లు మంజూరయ్యాయని మార్క్‌ఫెడ్ అధికారి హన్మంత్‌రెడ్డి చెప్పారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల రైతులకు రూ.28.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారి ఇంద్రసేనా తెలిపారు.