నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగులయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. ఈ గుర్తింపుతో మొగులయ్య మనసైతే సంతసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛను కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు.
ఆసరా పింఛను అడిగితే వయసు చాలదన్నారు. మొగులయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. మూడో కుమారుడు పదోతరగతి చదువుతుండగా, రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి నెలకు రూ.4 వేల వరకూ ఖర్చవుతోంది. మొన్నటివరకు అక్కడక్కడా వాయిద్య ప్రదర్శనలతో పొట్టపోసుకున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది. ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమైంది. దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక ఆయన నలుగురినీ యాచించాల్సిన స్థితి. పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించారు.
- ఇదీ చదవండి : సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ మృతి-ప్రధాని సంతాపం