Financial troubles to do wife's Funerals: అనారోగ్యంతో భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందితే ఇంటికి తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు.. వెంట ఇద్దరు చిన్నారులు.. ఏం చేయాలో తెలియక కలిసిన వారందరినీ సాయం అడుగుతున్న దీనస్థితి అతనిది. విషయం తెలిసి ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచింది. అంత్యక్రియలు నిర్వహించి, పిల్లలను ఆశ్రమంలో చేర్పించి ఉదారత చాటుకుంది. సికింద్రాబాద్ గాంధీఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నాగరాజు, బాలమ్మ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. ఇటీవల బాలమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. స్థానికుల చొరవతో పిల్లలను తీసుకుని భార్యను గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. చికిత్స పొందుతూ ఆమె ఈనెల 18న మృతిచెందింది. భార్య మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు చేతిలో డబ్బులు లేక ఆస్పత్రి ఆవరణలో అందరినీ యాచించసాగాడు.
ఈ విషయం తెలిసిన నగరంలో అనాథ శవాలను మార్చురీలకు తరలించే సేవలందిస్తున్న 'రియల్ వివేక్ ఫౌండేషన్' నిర్వాహకుడు శ్రీనివాస్ ఆస్పత్రిలో నాగరాజును కలిశాడు. సొంతూరిలో అయినవారు ఎవరూ లేరని, అక్కడికి వెళ్లేందుకు డబ్బుల్లేవని తెలిసి, అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించి, పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించి చదివించడంతోపాటు, అతనికి ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో నాగరాజు అంగీకరించాడు. అదేరోజు అల్వాల్‌లో బాలమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని కరుణామయ అనాథాశ్రమంలో పిల్లలను చేర్పించారు. పిల్లల చదువు కోసం ఆశ్రమంలో చేర్పించామని, నాగరాజుకు సైతం అక్కడే ఉపాధి కల్పిస్తామని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారని తెలిపారు.
ఇవీ చదవండి: సోదరుడు రాలేదని.. అల్లుడిపై మహిళ హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..!