హైదరాబాద్కు చెందిన ఓ బడా వ్యాపారి నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో కొంత భూమిని కొని, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అది అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నా కొనుగోలు పేరుతో రైతుల నుంచి 80 ఎకరాల ప్రభుత్వ భూమి లాక్కొన్నాడు. దర్జాగా తన భూ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు.
అక్రమ రిజిస్టేషన్లు
కుప్పగండ్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 89, 90, 91, 92, 93 లో వంద ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో దాదాపు 80 ఎకరాల భూమిని భాగ్యనగరానికి చెందిన ఓ వ్యాపారి ఆక్రమించాడు. సర్వే నెంబర్లు 90, 92, 93 లో తన పేరున 7.23 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. అందులోని 33 గుంటల భూమిని ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రికార్డుల్లో నమోదు చేయించాడు.
కౌలుకిచ్చి.. దృష్టి మరల్చి
ఈ సర్వే నంబర్లలోని భూమిలో 13.38 ఎకరాల భూమిని 11 మంది లబ్ధిదారుల పేరిట ఉన్న ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులోని అనుభవదారు కాలంలో నమోదు చేయించాడు. ఉన్నత అధికారుల దృష్టి మళ్లించేందుకు ఆ భూమిని స్థానిక రైతులకే కౌలుకిచ్చి పంటలను సాగు చేయిస్తున్నాడు. ఈ భూములకు మార్కెట్లో ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ధర పలుకుతోంది.
నిబంధనలకు నీళ్లొదిలి
ఆక్రమణకు గురైన భూమిని స్థానికంగా ఉండే కొంతమంది గిరిజనులకు దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలుగా పంపిణీ చేసింది. అసైన్డ్ భూమిని కొనరాదు- అమ్మరాదంటూ నిబంధనలు పేర్కొంటున్నా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాపారి పేరుపై కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు.
గుట్టురట్టు
మిగతా భూమికి మ్యుటేషన్ చేయించుకునేందుకు ఆ వ్యాపారి అర్జి పెట్టుకోవడంతో ఈ వ్యవహారమంతా బయటపడగా... రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ప్రక్రియను నిలిపి వేశారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వెల్దండకి బదిలీపై వచ్చిన నూతన తహసీల్దార్ సైదులు తెలిపారు.
- ఈ కథనం చదవండి: మార్పెక్కడ: 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!