ముంబయికి చెందిన 52ఏళ్ల మహిళకు దైవచింతన ఎక్కువ. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకునేది. గతేడాది డిసెంబరులో తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. జనవరిలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సమంతమలైకి చెందిన 62ఏళ్ల సాధువు మట్కాస్వామి అలియాస్ పిలకస్వామి కూడా పుణ్యక్షేత్రాలను తిరుగుతుంటాడు. కొద్దికాలంగా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఉంటున్నాడు. అక్కడే ముంబయి మహిళకు కనిపించిన పిలకస్వామి అడవిలో ఉండే అక్కమహాదేవి ఆలయం మహిమాన్వితమైనదని, దర్శించుకుంటే మంచిదని చెప్పాడు. సాధువని నమ్మిన ఆమె ఆ ఆలయాన్ని చూపించాలని కోరింది. జనవరి 25న ఇద్దరూ కలిసి కొద్దిదూరం జీపులో, మరికొంత దూరం బస్సులో ప్రయాణించి నల్లమల అభయారణ్యంలోని అటవీశాఖ రేంజ్ గేటు-168 సమీపంలో దిగారు. కాలినడకన అక్కమహాదేవి గుహల వైపు బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక మట్కాస్వామి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హత్యచేసి పారిపోయాడు.
ఈనెల 2న అటుగా వెళ్లిన అటవీ సిబ్బంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. కొంతదూరంలో ఆ మహిళకు చెందిన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, శ్రీశైలంలో బసచేసిన గది రశీదులు దొరికాయి. ఆధార్‌కార్డు ఆధారంగా ముంబయిలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీశైలంలో ఆమె బసచేసిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
ఇదీ చూడండి : శరీరంపై పెయింటింగ్ వేసుకుని ప్రచారం