మాజీప్రధాని స్వర్గీయ పీ.వీ.నరసింహారావు కాంస్య విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో సిద్ధమవుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రతిష్ఠించేందుకు విగ్రహం తయారు చేయాలని తెనాలికి చెందిన సూర్య శిల్పశాలకు ఆర్డర్ వచ్చింది. పీవీ అభిమానులు కొందరు ఈ విగ్రహం తయారీ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు.
ప్రస్తుతం విగ్రహ నమూనా సిద్ధమైందని... ఫొటోలు ఆన్లైన్లో చూసి విగ్రహ కమిటి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు చెప్పారు. నమూనా విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మలిచే పనులు ప్రారంభించామన్నారు. 8 అడుగుల ఎత్తు... 400 కిలోల బరువుతో ఈ విగ్రహం రూపొందిస్తున్నట్లు తెలిపారు. పీవీ మన తెలుగువారి ఠీవి అనేలా విగ్రహం రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు. విగ్రహం పూర్తి కావటానికి మరో నెల రోజులు సమయం పడుతుందన్నారు.