నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈనెల 25వ తేదీన జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి రూ. 3లక్షల 20 వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కడపకు చెందిన రామ్ గంగారెడ్డి నాగర్కర్నూల్లో వేరుశనగ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారి గుమాస్తా ధనకోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారానికి సంబంధించిన రూ. 3 లక్షల 35 వేల 500 నగదు తీసుకుని వ్యాపారి మధుశెట్టితో కడపకు బయలుదేరాడు. చీకటి కావడం వల్ల బస్సులు లేక బిజినేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లో రాత్రి నిద్రించాడు. గమనించిన దొంగ గుట్టుగా నగదు ఎత్తుకెళ్లాడు. ఘటనపై ధనకోటేశ్వర్ రెడ్డి బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికంగా డీసీసీబీ బ్యాంకు వద్ద రాములు అనే వ్యక్తి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న విషయాన్ని కొందరు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా... నిందితుడు దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పు కున్నాడు. దొంగిలించిన నగదులో ఏడు వేల రూపాయలతో సెల్ఫోన్ కొన్నట్లు, ఎనిమిది వేల రూపాయలు ఇతర ఖర్చులకు వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు. మిగిలిన రూ. 3 లక్షల20 వేల నగదు, సెల్ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్