Government lands kabza in Nagar Kurnool: శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో మల్కమయ్య కుంట ఉంది. నీటి పారుదల శాఖ నోటిఫైడ్ చెరువుల జాబితాలోని ఈ చెరువు పరిధిలో 86 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు శిఖం భూములను.. ప్రభుత్వం ఈనాం భూముల కింద పంపిణీ చేసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో.. ఈ భూములపై రియల్టర్ల కన్నుపడింది.
మూడెకరాలు ఆక్రమించారు: హైదరాబాద్‌కు చెందిన కొందరు స్థిరాస్తి వ్యాపారులు.. అక్కడ 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమి చెరువు కట్టకు ఆనుకుని ఉండటంతో కొన్నిచోట్ల మట్టికట్టను ధ్వంసం చేశారు. పంట పొలాలకు వెళ్లే దారి శిథిలం కాగా దాన్ని ఆక్రమించారు. ఎకరా భూమి విలువ దాదాపు రూ.80 లక్షల వరకు పలుకుతోంది. మూడెకరాలకు పైగా భూమి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. మల్కమయ్య కుంటకు నీరొచ్చే కల్వర్టును మూసివేశారు. ఆ కల్వర్టుకు ఆనుకునే ప్రహరీని నిర్మించారు. ఆ కల్వర్టు పైన కుప్పగండ్ల నుంచి పది గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది.
అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు: నీళ్లొచ్చే దారి మూసేస్తే వచ్చే నీళ్లు ఎక్కడికి వెళ్లాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. రైతులు ఫిర్యాదు చేయడంతో మూసిన కల్వర్టు దారిని తెరవడంతో పాటు నీళ్లు వెళ్లేందుకు ప్రహరీ కింద నుంచి దారి వదిలారు. ఈ వ్యవహారమంతా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా, రియల్టర్లు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల ఫిర్యాదుతో.. భూయజమానులకు ఫిర్యాదు: నిబంధనల ప్రకారం పట్టా భూములైనా.. అందులో నోటిఫైడ్ చెరువులు, కుంటలు ఉంటే వాటిని ధ్వంసం చేయడానికి వీల్లేదు. చెరువులు, కుంటల్లోకి నీటిని మోసుకొచ్చే కాల్వలను సైతం ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా చెరువులు, కుంటల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు వీలే లేదు. అలాంటిది మల్కమయ్య కుంటలో చెరువు కట్ట, కాల్వల్ని ధ్వంసం చేశారు. రైతులు చేసిన ఫిర్యాదుతో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్వంసం చేసిన కట్ట, కాల్వలను పునరుద్ధరించాలని సదరు భూయజమానులకు నోటీసులు జారీ చేశారు.
Actions of the authorities: ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువుకు ఆనుకుని ఉన్న భూమిని ప్లాట్లుగా మార్చకుండా నాలా అనుమతి ఇవ్వొద్దని తహసీల్దారు, ఆర్డీవోలకు సైతం సూచించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కట్టను పునరుద్దరించాలని భూయజమానులను ఆదేశించారు. అయినా పూర్తిస్థాయిలో మల్కమయ్య కుంటను పునరుద్ధరించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జాతీయ రహదారికి ఆనుకుని ధ్వంసమైన చెరువులు, కుంటల్లో ఇది మచ్చుకు ఒకటే. వెల్దండ మండలం పెద్దాపూర్ ఈదుల చెరువులో 6 ఎకరాల భూమిని కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించారు. కల్వకుర్తిలోని ఎర్రకుంట ఆక్రమణకు గురవుతుందని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో సాతాపూర్, కల్వకోలు, ఆదిరాల రహదారుల పక్కన ఉన్న చెరువులను స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చారు. అచ్చంపేటలోని మల్లంకుంట ఆక్రమణకు గురై ప్లాట్లు, ఇళ్లు వెలిశాయి. అధికారులు కొన్ని ఇళ్లను తొలగించినా, ఆక్రమణలు మాత్రం ఆగటం లేదు.
ఇవీ చదవండి: