తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అందులో ఒకటి నాగర్ కర్నూల్. జిల్లాగా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ దానికి కావల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం, అదికారులు విఫలమయ్యారు. నాగర్ కర్నూల్ పట్టణంలో చేపలు,మటన్, చికెన్ తదితర మాంసాహారం అమ్మడానికి నాన్‌వెజ్ మార్కెట్ లేక.. మాంసాహార విక్రయాలు రోడ్డుపైనే జరుగుతున్నాయి. గత 30 ఏళ్లుగా పట్టణంలోని ప్రధాన రహదారిపై, రైతుబజార్ బయట వ్యాపారులు మాంసం అమ్ముతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించిన పలు సందర్భాల్లో ప్రత్యేక మాంసాహార మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీసం స్థలాన్ని కూడా కేటాయించలేదు. దీంతో వ్యాపారులు ఫుట్‌పాత్ పైనే మాంసం అమ్మకాలు జరుపుతున్నారు.
రోడ్డుపైనే అమ్మకాలు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా, విస్తారంగా వర్షాలు కురవడం వల్ల చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం, నాగనూల్ చెరువు, ఎండబెట్ల చెరువు, గుడిపల్లి రిజర్వాయర్ నుంచి మత్స్యకారులు నాగర్ కర్నూల్ పట్టణానికి చేపలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ చేపల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే.. మాంసాహారం కోసం ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడం వల్ల చేపలు రోడ్డుపైనే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపు 300 కుటుంబాలు మటన్ అమ్మడం జీవనోపాధిగా గడుపుతున్నాయి. పట్టణంలో మటన్ కొట్టే దుకాణాలు 50 ఉన్నాయి. 15 దుకాణాల్లో ప్రతిరోజు మటన్ అమ్ముతారు. రైతుబజార్ ముందు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీపురం రోడ్డు, నల్లవెల్లి రోడ్డుపైన, రోడ్డుపక్కల ఫుట్‌పాత్‌ల పైన మాంసం అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. వీరితో పాటు.. పలు ప్రాంతాల నుంచి మత్స్యకారులు పెద్ద ఎత్తున వచ్చి చేపలు అమ్ముతుంటారు. చికెన్ దుకాణాలకైతే.. లెక్కేలేదు. అయితే.. మాంసానికి సంబంధించిన వ్యర్థాలు రోడ్డు పక్కన వేయడం వల్ల దుర్వాసనతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
హామీ ఇచ్చి.. మరిచారు
సమస్య గురించి అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. గత మూడేళ్ల క్రితం రైతుబజార్ ముందు సుమారు 47 దుకాణలు ఏర్పాటు చేసేందుకు గానూ.. దుకాణ సముదాయం నిర్మించేందుకు శంఖుస్థాపన చేశారు. ఆ సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి మాంసం వ్యాపారులు తమ సమస్యను చెప్పుకున్నారు. దుకాణ సముదాయంలో మాంసం దుకాణల కోసం 5 షెట్టర్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తీరా.. దుకాణ సముదాయాలు నిర్మించాక బహిరంగ వేలంపాట నిర్వహించారు. అందులో ఎక్కువ ధరకు వేలంపాట పాడిన వారికే దుకాణాలు అప్పగించారు. రూ.30 నుంచి 50 వేల వరకు వేలం పాడి.. కొంతమంది దుకాణ సముదాయాలు దక్కించుకున్నారు. అయితే.. అంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మాంసం వ్యాపారులెవ్వరూ వేలంపాటలో పాల్గొనలేదు. చేసేదేం లేక.. ఎప్పట్లాగే దుకాణ సముదాయాల ముందు మాంసాహార విక్రయాలు జరుపుతుంటే... దుకాణాలను చేజిక్కించుకున్న వారు అడ్డు చెప్తున్నారు. తమ దుకాణాల ముందు.. మాంసం అమ్మవద్దని అడ్డుకుంటున్నారు. అటు అధికారులు పట్టించుకోక.. ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోక.. ఏం చేయాలో తెలియక మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గత 30 ఏళ్లుగా అక్కడే మాంసం అమ్ముకున్నామని.. ఆ ప్రాంతంలో అధికారులు దుకాణ సముదాయం కట్టి.. మాంసం వ్యాపారుల కోసం షెట్టర్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పారని.. మరోవైపు దుకాణ యజమానులు అక్కడి నుంచి మాంసం దుకాణాలు తొలగించాలని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
మార్కెట్ లేకున్నా.. ఫైన్ విధిస్తారా?
మాంసం అమ్మడానికి నిర్దిష్ట దుకాణ సముదాయం లేక.. రోడ్డుపైనే మాంసాహారం అమ్మడం వల్ల.. వాటికి సంబంధించిన వ్యర్థాలు రోడ్డుపైనే వేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వచ్చి.. స్థానికులు, ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు జిల్లాకేంద్రంలో మాంసాహార మార్కెట్ లేకపోవడం పట్ల పట్టణ ప్రజలు సైతం అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుట్‌పాత్‌పై మాంసం కొనాలంటే భయంగా ఉందంటున్నారు. వీధుల్లో, రోడ్లపై అమ్మే మాంసం కొని అనారోగ్యం పాలు కావాలా..? లేక మంచి పోషకాహారం తిని ఆరోగ్యంగా ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మాంసం అమ్మకాలు కోసం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని అటు స్థానికులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి స్థలం లేకపోవడం వల్ల నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయలేకపోయామని... అనువైన స్థలం చూస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ విక్రయాలు జరిపితే ఫైన్ విధిస్తామని హెచ్చరిస్తున్నారు. త్వరలోనే నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేసి.. మాంసం వ్యాపారుల ఇబ్బందులు తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కుమార్ తెలిపారు. అయితే.. నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయకుండా.. జరిమానా ఎలా విధిస్తారని స్థానికులు, మాంసం వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.