నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి ఇప్పల చెరువులో సుమారు 800 మంది ఉపాధి హామీ కార్మికులు పని చేస్తున్నారు. కూలీల్లో మాస్కులు ఎవరూ ధరించట్లేదు. భౌతిక దూరమూ పాటించిన దాఖలాలు లేవు. ఇక తాగునీరు, నీడ కోసం షామియానాల్లాంటి ఏర్పాట్లు సైతం అక్కడ కనిపించలేదు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు లేకపోవడం వల్ల పనుల పర్యవేక్షణ గ్రామ కార్యదర్శులకు అప్పగించారు.
గ్రామ కార్యదర్శి కళావతిని వివరణ కోరగా పనుల్ని విభజించి వేర్వేరు చోట్ల కొంతమంది మాత్రమే పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు ఆగకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపాధి హమీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నారు. కానీ కూలీలు, సిబ్బంది మాత్రం నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.