ఓ గర్భిణీకి శస్త్రచికిత్స కోసం 'ఓ- నెగిటివ్' రక్తాన్ని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహన్... స్వయంగా దానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహన్ గురువారం బాధ్యతలు స్వీకరించగా... మొదటిరోజునే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. జిల్లా కొవిడ్ ఐసోలేషన్ వార్డులో ఎంత మంది చికిత్స పొందుతున్నారు... వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారన్న అంశాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి కలెక్టర్ ధైర్యం చెప్పారు. మెటర్నటీ వార్డులో బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. ఓ గర్భిణీకి శస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఓ-నెగిటివ్ రక్తం అవసరం ఉండగా... తనది ఓ-నెగిటివ్ రక్తమేనని వైద్యులకు తెలిపి... స్వయంగా రక్తాన్ని దానం చేశారు. కొవిడ్ దృష్ట్యా రక్తం కొరత ఏర్పడుతోందని... యువత ముందుకు వచ్చి రక్త దానం చేయాలని సూచించారు. కలెక్టర్ దాతృత్వం పట్ల జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.