పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, తేమ శాతం తప్పుగా చూపించి అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ అధికారులను హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని గగ్గలపల్లి, తెలకపల్లి, చిన్న ముద్దనూరు గ్రామాల సీసీఐ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
"ఎన్ని రోజుల క్రితం వచ్చారు.. వాహనాలను టోకెన్ క్రమంలోనే పంపుతున్నారా.. మధ్యలో ఏదైనా వాహనాలను పంపుతున్నారా" వంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం కొలిచే దగ్గర.. తూకం చేసే దగ్గర ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నారా అని రైతులను అడగగా.. తేమను మిషన్ ద్వారా కాకుండా చేతులతో చూస్తున్నారని కొందరు రైతులు వాపోయారు.
![nagar kurnool collector visit cci purchase centers in different villages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9759131_494_9759131_1607065555834.png)
బిల్లులో తేమ శాతం 11 ఉన్న వాహనాన్ని కలెక్టర్ మరోసారి పరిశీలించగా.. 7.25 శాతం రావడంతో సంబంధిత అధికారులపై మండిపడ్డారు. తూకం, తేమ శాతం సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో కొలవాలని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: గ్రేటర్లో పోటాపోటీగా ఫలితాలొస్తే వీళ్లదే కీలకపాత్ర