కృషి, పట్టుదల, అంకితభావం, కఠోర దీక్షతోనే ఈరోజు జిల్లా కలెక్టర్గా మీ ముందున్నానని నాగర్కర్నూల్ పాలనాధికారి ఎల్ శర్మాన్ చౌహన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి వారికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. కలలు కనాలని... ఆ కలలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించాలన్నారు.
తాను పదో తరగతి ఫెయిల్ అయ్యానని... ఆ తర్వాత కఠోర దీక్షతో చదివి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానని వివరించారు. ఒక లక్ష్యం ఎంచుకుని దాని కోసం శ్రమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న వయస్సు నుంచే సమయపాలన పాటించాలని... తాను 15 నిమిషాలు కార్యక్రమానికి ఆలస్యమైనందుకు తనను క్షమించాలని విద్యార్థులను కోరారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.