పాఠశాలల్లో విద్యార్థుల క్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. ధైర్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలోని గిరిజన బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆమె పునఃప్రారంభించారు.
కొవిడ్ తర్వాత ఎలా ఉంది..?
గిరిజన బాలికల విద్యాలయాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్.. విద్యార్థుల బోధనకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతులకు వెళ్లి విద్యార్థులను కలిసి కొవిడ్ అనంతరం పాఠ్యాంశాలు ఎలా అర్థమవుతున్నాయని కనుక్కున్నారు.
పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం నడచుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పరిశుభ్రమైన ఆహారం విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ.. స్వయంగా వడ్డించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గోదాంలో అగ్నిప్రమాదం... డెకరేషన్ సామగ్రి దగ్ధం