పట్టభద్రుల ఓటర్ల నమోదు ఉద్ధృతంగా సాగాలని... ఓట్లు నమోదు చేయించే బాధ్యత తెరాస నాయకులదేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభంజనం సృష్టించాలని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్యకర్తలు, ముఖ్యనాయకులు, పట్టభద్రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రానికి హైకోర్టు, కేంద్రం నుంచి ప్రయోజనాలు వస్తాయని నమ్మి గతంలో భాజపాకు పట్టభద్రులు ఓటేశారని... ఇప్పటి వరకు వారు సాధించిందేమీ లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అంటే ఉద్యోగం ఇచ్చేది కాదని... ఉపాధి అవకాశాలను పెంచేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలని... ఇంటికో ఉద్యోగమని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.
అక్టోబర్ 1 నుంచి గ్రామగ్రామాన పట్టభద్రుల నమోదు ప్రక్రియను వేగంగా చేయించాలని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి పట్టభద్రులు అండగా నిలవాలని నాగర్‌కర్నూల్ నుంచి భారీ మెజార్టీతో ఓట్లు సాధించాలని ఎంపీ రాములు, విప్ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి : జాతీయ సీతాకోక చిలుక ఎంపికకై పోటీలు