తమకు వెంటనే పునరావాసం కల్పించాలంటూ వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనుల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండ తండా గ్రామస్థులు… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పనుల్లో తమ భూములు కోల్పోతున్నామని తెలిపారు.
తమకు ఇంత వరకు పునరావాసం కల్పించలేదని… పనులు జరిగే వద్ద వాహనాలను ఆపి బైఠాయించి నిరసన తెలిపారు. తమ పునరావాసం కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంలో జాప్యం చేస్తున్నారని, వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలు వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు.
వైద్యం, ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. బ్లాస్టింగ్లతో జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిర్మాణ పనులకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారు, అధికారులు వచ్చి వారికి ప్రస్తుతం తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: Revanth reddy: 'పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి'