Kollapur Politics: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెరాస నేతలు జూపల్లి కృష్ణారావు- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య అధిపత్యపోరు తారస్థాయికి చేరింది. కొన్నేళ్లుగా ఎడమొహం -పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు... ఇటీవల ఒకరిపై ఒకరు బహిరంగంగానే పరస్పర, వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. కొల్లాపూర్ అభివృద్ధి సహా పరస్పరం చేసుకున్న ఆరోపణలపైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ నేతలు సవాళ్లు విసురుకున్నారు.
కొల్లాపూర్ అంబేడ్కర్ చౌరస్తాలో ఇవాళ బహిరంగ చర్చకు రావాలంటూ జూపల్లి కృష్ణారావు సవాలు చేయగా, జూపల్లి ఇంటికే వెళ్తానంటూ బీరం బదులిచ్చారు. ఇరువర్గాల నుంచి బహిరంగచర్చకు అనుమతివ్వాలంటూ పోలీసులకు దరఖాస్తులు వెళ్లగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్‌లో ఇవాళ జనం గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇరువురు నేతలు బహిరంగ చర్చకు వస్తారా... పోలీసుల ఆదేశాలు పాటిస్తారా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైన బీరం హర్షవర్ధన్‌రెడ్డి.. ఆ తర్వాత తెరాసలో చేరారు. బీరం చేతిలోనే ఓటమి పాలైన జూపల్లికి.... హర్షవర్ధన్‌రెడ్డి చేరికతో పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఈక్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తొలుత మౌనం వహించిన జూపల్లి... ఆ తర్వాత బహిరంగ విమర్శలకు దిగారు. ఇద్దరు నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు ఇటీవల కొల్లాపూర్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి మాట్లాడి కలిసి పనిచేయాలని సూచించడంతో వర్గపోరుకు తెరపడుతుందని అంతా భావించారు. కానీ బహిరంగ చర్చకు సిద్ధమంటూ తిరిగి సవాళ్లు సంధించుకోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
బహిరంగ చర్చ సవాళ్ల నేపథ్యంలో పోలీసులు కొల్లాపూర్‌లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల విభేదాలు ఎక్కడికి దారి తీస్తాయోనని పార్టీ శ్రేణులు సహా సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇవీ చూడండి: