నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మొదటి లిఫ్ట్ పంప్ హౌజ్‌లోకి శుక్రవారం ప్రమాదవశాత్తు నీరు చేరింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తెరాస కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంప్‌హౌజ్ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడి.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
పంప్‌హౌజ్‌లోకి నీరు చేరడం దురదృష్టకరమని.. సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం సంతోషకరమని జూపల్లి పేర్కొన్నారు. ఈ ఘటన ఎందుకు, ఎలా జరిగింది అనే విషయం సంబంధిత అధికారులు తేల్చాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పంప్‌హౌజ్‌ను పునరుద్ధరించే పనులు చేపడుతుందని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.