సివిల్స్ ఫలితాల్లో దేశ స్థాయిలోనే 57వ ర్యాంకు సాధించారు షాహిద్. బల్మూర్ మండలం తుమ్మంపేటకు చెందిన రెహన బేగం, హన్నన్ దంపతులకు మొదటి సంతానమైన షాహిద్... చిన్ననాటి నుంచే ఐఏఎస్ లక్ష్యంగా కృషి చేశానని చెబుతున్నారు. రెండు సార్లు ప్రయత్నించి విజయం సాధించలేకపోయినా... ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించానంటున్నారు షాహిద్.
పట్టు వదలని విక్రమార్కుడిలా...
షాహిద్... ఐదో తరగతి వరకు అచ్చంపేటలో, 10 వరకు జవహర్ నవోదయ వట్టెంలో, హైదరాబాద్ శ్రీ చైతన్యలో ఇంటర్ విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం దీర్ఘకాల శిక్షణతో రెండు సార్లు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికైనా... విశ్రమించకుండా చదివి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు సాధించాడు. దానితోనూ సంతృప్తి చెందని షాహిద్... ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశారు. 57వ ర్యాంకు సాధించి తన చినప్పటి లక్ష్యాన్ని ఛేదించారు.
పుత్రోత్సహంలో తల్లిదండ్రులు...
తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి ఉన్న తన అభిరుచిని గమనించి ప్రోత్సాహించారు. ఎంతో కష్టపడిన తమ కొడుకు అనుకున్నది సాధించటం చాలా గర్వంగా ఉందని షాహిద్ తల్లిందండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ సేవకు సిద్ధం...
తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహం వల్లే తన విజయం సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు షాహిద్. ఎన్నో ఏళ్ల తన కల నేరవేరటం పట్ల సంతోషంగా ఉందంటున్న ఈ సివిల్స్ ర్యాంకర్... దేశానికి అంకితభావంతో సేవ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు.
ఇవీ చూడండి: స్వచ్ఛందసంస్థ స్థాపకుడి నుంచి సివిల్స్ర్యాంకర్గా..!