నాగర్‌కర్నూలు జిల్లాలోని కొవిడ్ నిర్ధరణ కేంద్రాల వద్ద అనుమానితులు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పక్కన పెట్టిమరీ ఒకరిపై ఒకరు పడుతూ క్యూ కట్టారు. లాక్డౌన్ అమలు చేస్తున్నందున రోజంతా టెస్టులు చేయరేమోనని ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రాలకు వచ్చారు. ఉదయం నుంచి ఎండలోనే నిలుచుని పడిగాపులు పడ్డారు.
భౌతిక దూరం మాట మరిచారు... తాగాడానికి నీళ్లు లేవు.. నిలువ నీడలేదు.. టెస్టు ఎప్పుడు చేస్తారో తెలియదు.. ఎంత మందికి చేస్తారో తెలియదు... అయినా తప్పని పరిస్థితిలో మండుటెండలోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. టెస్టుల కోసం వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంటోంది.
జిల్లా కేంద్రంలో ర్యాపిడ్ టెస్టులు 50, ఆర్టీపీసీఆర్ 100 ఇలా మొత్తంగా వంద నుంచి 150 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. కానీ అనుమానితుల సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. వచ్చిన వారిలో ఎంత మందికి కొవిడ్ ఉందో తెలియదు కాని లేని వారికి మాత్రం కచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంది.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'