నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం దగ్ధమైంది. గత మూడు రోజులుగా నల్లమల అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజు రోజుకి అడవిలో ఉన్న విలువైన వృక్షాలు, మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇవాళ శ్రీశైలం వెళ్లే రహదారిలో వటవర్లపల్లి, దోమలపెంటకు మధ్య భారీ మంటలు వ్యాపించాయి. ఈ మంటలతో ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అటవీశాఖ తక్షణమే చర్యలు చేపట్టకపోతే అటవీ ప్రాంతం మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది.
అయితే ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే సందర్శకులు ఎవరైనా విడిదిలో భాగంగా సిగరెట్ లేదా వంటలు చేసి మంటలు ఆర్పకుండా పోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీశాఖ వారు వేసవికాలం రావడం వల్ల మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం