నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కేసరి సముద్రం చెరువులో సామర్థ్యానికి మించి నీరు నింపడంతో రైతులు గట్టుపై ఆందోళనకు దిగారు. పంట పొలాలు నీట మునిగాయంటూ నాగర్ కర్నూల్, ఎండబేట్ల, తిరుమలాపురం, ఉయ్యాలవాడల అన్నదాతలు నిరసన తెలిపారు. చెరువును రిజర్వాయర్‌గా మార్చి నీటిని అధికంగా ఉంచుతున్నారని ఆరోపించారు.
నీరు తీసి సర్వే చేయాలి..
సామర్థ్యానికి మించి నీరు నింపడంతో ఆయా గ్రామాల పరిధిలో సుమారు 400 ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఇల్లు కట్టుకున్న వారికి.. సర్వేకొచ్చిన అధికారులు ఈరోజు నోటీసులు అందజేయడంతో వారిని అన్నదాతలు అడ్డుకున్నారు. నీటిని తొలగించి సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఎండబెట్ల చెరువు నీటి ప్రవాహానికి అడ్డంగా వేసిన చెక్కలను తొలగించాలన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ లెవెల్‌ను 4 సార్లు అధికారులు నింపారు. అందువల్లే పొలాలు నీటమునిగాయని రైతులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యకు అనుమతివ్వాలి..
పంట పొలాలు నీట మునగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూములు తమకు ఇప్పించాలని.. లేదంటే ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నారు. సమస్యను వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, రైతులు, కలెక్టర్ సమక్షంలో చర్చించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం