తమ భూమిని తమకు ఇప్పించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లికి చెందిన బసవలింగం అనే రైతు కలెక్టర్‌ను సోమవారం కలిశారు. తన అత్తమామల నుంచి తన భార్య గిరిజకు వారసత్వంగా సంక్రమించిన సర్వే నంబర్ 264లోని 23.37 ఎకరాల భూమిని దౌర్జన్యంగా అదే గ్రామానికి చెందిన రవిశంకర్, కృష్ణయ్యలు ఆక్రమించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి విషయంలో గతంలో కోర్టులో దావా వేసి గెలిచామని... అధికారులు సహకరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
భూమి మీదికి తాము వెళ్తే చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము విత్తనాలు వేస్తే వాళ్లు పంట కోసుకుంటున్నారని, ఎవరికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయానని, చివరకు కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. తమ భూమి ఇప్పించకపోతే తానూ, తన భార్య కలిసి జనవరి 26న ఆత్మహత్య చేసుకుంటామని... అందుకు అనుమతి ఇవ్వండని కలెక్టర్‌ను కోరారు.
తక్షణమే విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆత్మహత్య ఆలోచన తప్పు అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: షీ క్యాబ్స్ పైలట్ ప్రాజెక్ట్... మహిళలకు మరో గొప్ప అవకాశం!