Doctors Negligence: గర్భిణులకు కొవిడ్ సోకినా, ప్రసవం కోసం వచ్చిన మహిళలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం నిరాకరించవద్దని, అందుకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు ప్రభుత్వాసుపత్రుల్లో చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్ రావు ఇటీవలే అధికారులను ఆదేశించారు. కానీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొవిడ్ సోకిందన్న నెపంతో ఓ చెంచు మహిళకు ప్రసవానికి నిరాకరించారా ఆసుపత్రి వైద్యులు. నొప్పులు భరించలేని సదరు మహిళ ఆసుపత్రి ఆవరణలోనే ప్రసవించి ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఈ హృదయ విదారక ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.
నొప్పులు తీవ్రమైనా కరుణించని సిబ్బంది
బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ మంగళవారం ఉదయం 8 గంటలకు నొప్పులతో బాధపడతూ ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. వైద్యాధికారుల సూచన మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ సోకిందని తేలడంతో నొప్పులతో బాధ పడుతున్నా, నిండుగర్భిణిని వైద్యాధికారులు ఆసుపత్రిలోకి అనుమతించలేదు. పీపీఈ కిట్లు లేవని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా విధుల్లో ఉన్న వైద్యులు సూచించారు. నొప్పులు తీవ్రమైనా సిబ్బంది కరుణించలేదు. చేసేదేమీ లేక ప్రసవ వేదన పడుతున్న ఆమెను సోదరిణులు అలివేల, రాజేశ్వరి, ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకువెళ్లారు. నానా అవస్థలూ పడి సాధారణ ప్రసవం చేశారు.
మంత్రి ఆగ్రహం
ఆడబిడ్డకు జన్మనివ్వగా.. అప్పుడు మేలుకున్న సిబ్బంది తల్లి, బిడ్డను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ఇద్దరూ క్షేమంగా ఉండటంతో సాయంత్రం ఇంటికి పంపారు. ఘటన గురించి తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: