ప్రకృతి అందించిన అందాలన్నీ కనుమరుగవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ పేటలో జిల్లా వ్యాప్తంగా కొండలన్నీ కరిగిపోతున్నాయి. అక్రమ మైనింగ్ కారణంగా ఊరుకొండ పేటలోని కొండల మధ్య వెలసిన ఆంజనేయస్వామి ఆలయానికి ముప్పు ఏర్పడింది. మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణానికి కొండపై చేపట్టిన పేలుళ్లతో ఆలయం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఇంతా జరుగుతున్నా అధికారులు ఏమి ఎరుగనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
విధ్వంసం
ఊరుకొండ పేటలోని ప్రభుత్వ భూమిలో పలువురు దాదాపు వెయ్యి ఎకరాల్లో ఉన్న కొండలను.. రాళ్లుగా మార్చి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజూ 50 నుంచి 100 వాహనాల్లో ఆరు జిల్లాలకు రాళ్లు తరలుతున్నాయి. అక్కడ జరుగుతున్న విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఏళ్ల కాలంగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. 2006లో మైనింగ్ శాఖ ఊర్కొండ, ఊర్కొండ పేట గ్రామాల్లోని కొండలను కొందరికీ లీజుకు ఇవ్వడానికి సిద్ధపడింది.
కార్మికుల మాటున లక్షలు
విషయాన్ని తెలుసుకున్న కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉషారాణిచే.. సొసైటీ పేరున సర్వే నెంబర్లు 203, 233లో రాళ్లను తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం అనుమతులు లేని కొండలను సైతం పగలగొడతూ లక్షలు దండుకుంటున్నారు. దళారులు అధికమై కార్మికుల మాటున లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యంత్రాలతో గుట్టలను ధ్వంసం చేయడం వల్ల సమీప వ్యవసాయ బోరుబావులు ముసుకుపోతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
నిత్యం రద్దీ
ఊరుకొండ పేట, ఊరుకొండ గ్రామాల్లో 230, 233, 248, 308, 346, 203 సర్వే నెంబర్లలో 830 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిలో కొండలు ఉన్నాయి. 40 ఏళ్లుగా ఇక్కడి కొండల్లో పెద్ద పెద్ద రాళ్లను పగులగొట్టి.. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కడిల తయారీ మాటున 50 మంది గుత్తేదారులుగా అవతారమెత్తి లక్షలు గడిస్తున్నారు. కొండలను రాళ్లుగా మార్చటానికి నిత్యం 300 మంది వరకు పని చేస్తున్నారు. ఆధునాతన యంత్రాలతో చేపడుతున్న పేలుళ్లు చుట్టుపక్కల రైతులకు శాపంగా మారుతున్నాయి. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఉమ్మడి జిల్లాతోపాటు కర్ణాటకకు కూడా తరలిస్తున్నారు. రాళ్ల అక్రమ రవాణాతో ఆ గ్రామాలు నిత్యం రద్దీగా ఉంటున్నాయి.
అనుమతుల ముప్పు
అప్పటి జిల్లా కలెక్టర్ రాళ్లు తొలగించడానికి సర్వే నెంబర్ 203, 233 అనుమతులు ఇచ్చారు. రాళ్లను తొలగించే వారు కొండలను తొలిస్తే ఆలయానికి, కొండపై ఉన్న కోనేరుకు, మిషన్ భగీరథ ట్యాంకులకు ప్రమాదం తప్పదు. ఇప్పటికే కొండపై ఉన్న మహిమగల కోనేటిని అనుసరించుకుని ఉన్న రాళ్లను పేలుస్తూ కడ్డీలుగా మారుస్తుండటం పట్ల.. ఆలయానికి వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి పక్కన ఉన్న కొండలను తొలచకుండా ఆపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
చట్టపరంగా చర్యలు
అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ తెలిపారు. రాళ్లు తీయటానికి అనుమతులు ఇచ్చిన ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తమన్నారు. అనుమతులు లేని కొండలపై తాళం తీస్తే చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. దేవాలయానికి, పరిసర ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఇదీ చూడండి : ఆపదలో ఆదుకునే ప్రాణదాతలు