డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా జలాశయం నిర్మాణం కోసం తమ భూముల్ని వదలుకునే ప్రసక్తి లేదని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఎర్రవెల్లి గ్రామ భూనిర్వాసితులు తేల్చిచెప్పారు. ఎర్రవెల్లిలో డిండి ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటికే భూములు సేకరించగా మిగిలిన భూముల సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు కల్వకుర్తి ఆర్డీఓ రాజేశ్ కుమార్ సహా నీటిపారుదల, రెవిన్యూశాఖ అధికారులు హాజరయ్యారు. కానీ గ్రామ సర్పంచ్ సాయి తనకు రెవిన్యూ శాఖ నుంచి సమాచారం లేదంటూ సభకు హాజరు కాలేదు. గ్రామ కార్యదర్శిని ఆరాతీయగా గ్రామంలో మూడు రోజుల పాటు డప్పు చాటింపు వేయించామని చెప్పారు. సర్పంచ్ లేకుండా గ్రామ సభ నిర్వహించబోమంటూ ఆర్డీఓ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలకు ఇప్పటికే భూములు కోల్పోయామని... వాటికి ఇంతవరకు పరిహారం అందలేదని నిర్వాసితులు అసహనం వ్యక్తం చేశారు. ఎకరా రూ. 25లక్షలకు పైగా పలుకుతున్న తమ భూములకు రూ.5 లక్షలివ్వడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా అధికారుల్ని అక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదంటూ... ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్నారు. నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని... తిరిగి గ్రామసభ తేదిని ప్రకటిస్తామని ఆర్డీవో రాజేశ్ కుమార్ నిర్వాసితులకు నచ్చజెప్పారు.
ఇదీ చదవండి: వేల లీటర్ల నీటిని మింగేస్తున్న 'మాయా బావి'