Clap Motor Nagarkurnool : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఎలికట్టకు చెందిన కర్నె లక్ష్మయ్య రైతు. ఎప్పటిలానే ఓ రోజు.. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లగా.. కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తడి చేతులతో స్విచ్ పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎంతోమంది రైతులకి ఈ కష్టనష్టాలు తెలుసు. చాలా మంది మరణిస్తున్నారు కూడా. అందుకే.. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే పనిలో పడ్డాడు.. లక్ష్మయ్య కుమారుడు కర్నె కల్యాణ్.
చప్పట్లు కొడితే స్టార్ట్ అయ్యేలా..
Clap Motor for fields : మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న కల్యాణ్.. పట్టుకోకుండానే మోటారు ఆన్ చేసేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. స్వతహాగా ప్రయోగాలంటే ఇష్టం ఉండడంతో పరిశోధనలు ప్రారంభించి.. చప్పట్లు కొడితే స్టార్ట్ అయ్యేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు.
నాన్న కోసమే..
"మా నాన్న ఓ సారి మోటార్ ఆన్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. దాని తర్వాత నాలో భయం మొదలైంది. ఆరోజు నాన్నకి ఏమైనా అయితే ఎలా అన్న భయం నాలో ఓ ఆలోచన రేకెత్తించింది. నాన్నే కాదు చాలా మంది రైతులు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే ముట్టుకోకుండా మోటార్ ఆన్ చేసేలా ఓ పరికరం కనిపెట్టాలనుకున్నాను. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. అయినా ఆశ కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాను. ఇప్పుడు సక్సెస్ అయ్యాను."
- కర్నె కల్యాణ్, యువపరిశోధకుడు
ముట్టుకోకుండానే ఆన్/ఆఫ్
Clap Motor by Karne Kalyan : ఓ పెట్టెలాంటి పరికరంలో సౌండ్ సెన్సార్లు అమర్చాడు. చప్పట్లు కొట్టినప్పుడు వచ్చే శబ్ద తరంగాలను బట్టి సర్వో మోటార్ పనిచేస్తుంది. దీనిలో ఉన్న ముల్లు గుండ్రంగా తిరుగుతూ.. మోటారు స్టార్టర్ స్విచ్‌కు తగులుతుంది. ఓ సారి మోటార్ స్విచ్ ఆన్ అయితే, మరోసారి ఆఫ్ అవుతుంది. ఇలా ముట్టుకోకుండానే మోటార్ ఆన్/ఆఫ్ చేయొచ్చు.
సెల్‌ఫోన్‌తో కూడా కంట్రోల్..
Kane Kalyan Invented Clap Motor : ఈ పరికరాన్ని సెల్‌ఫోన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఇందులో ఓ సిమ్‌ను ఉంచి.. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది, మళ్లీ ఫోన్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇలా రెండు తీరులుగా పని జరుగుతుండడంతో చాలా ప్రయోజనం ఉంటోంది. వర్షా కాలం, కరెంట్ తీగలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు షాక్ నుంచి తప్పించుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లి నప్పుడు.. నీళ్లు పెట్టేందుకు ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచైనా మోటార్‌ను నియంత్రించేందుకు వీలు పడుతుంది.
సర్వత్రా సంతోషం..
కల్యాణ్ ప్రయోగంపై.. తల్లిదండ్రులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరం వల్ల రైతుల శ్రమ, సమయం ఆదా అవుతుండడంతో పాటు విద్యుదాఘాతానికి గురవకుండా సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి పరికరాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు.
పొలానికి రాకుండానే నీళ్లు పారించేలా..
గతంలోనూ ఇలాంటి పరికరాలు తయారు చేసి మన్ననలు అందుకున్నాడు.. ఈ కుర్రాడు. రానున్న రోజుల్లోనూ వ్యవసాయ అనుబంధంగా మరిన్ని ప్రయోగాలు చేస్తానంటున్నాడు.. కల్యాణ్. పొలంలో కెమెరాలు ఏర్పాటు చేసి సెల్‌ఫోన్‌లో చూస్తూ.. పొలానికి రాకుండానే నీళ్లు పారించేలా చేస్తానంటున్నాడు.
తనకెదురైన సమస్యను అలా వదిలేయకుండా.. సరికొత్త పరిష్కారం చూపిన ఈ యువకుడు.. ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం సులువేనంటున్నాడు.