నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సై తనను దూషిస్తూ చితకబాదాడని న్యాయవాది శంకర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బోల్ గేట్ పల్లి గ్రామంలో ఉన్న తమ భూమిపై బాబాయ్ మోతీరావుకు తనకు గొడవలు జరుగుతున్నాయని బాధిత న్యాయవాది కమిషన్‌కు రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అచ్చంపేట పోలీస్ స్టేషన్లో తన బాబాయ్ ఫిర్యాదు చేశాడని శంకర్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐ ప్రదీప్ కుమార్ తన బాబాయ్‌తో కుమ్మకై తనను ఆ స్థలాన్ని వదులుకోవాలంటూ బెదిరింపులకు గురిచేశారని బాధితుడు వెల్లడించారు.
దూషిస్తూ.. విచక్షరహిత దాడి !
ఈ నేపథ్యంలో తన చెవులపై ఎస్సై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. విచక్షణరహితంగా ఎస్సై తనను చితకబాదాడని న్యాయవాది వాపోయాడు. రెండు చెవులపై ఎస్ఐ ఇష్టారీతిన కొట్టడం వల్ల కర్ణబేరీలు దెబ్బతిన్నాయన్నారు. న్యాయవాది అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ చేయిచేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకోండి..
ఎస్ఐపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు కమిషన్‌ను వేడుకున్నారు. స్పందించిన కమిషన్ ఈ ఘటనపై జూన్ 15లోగా నివేదిక సమర్పించాలని నాగల్ కర్నూల్ జిల్లా ఎస్పీని ఆదేశించింది.
ఇవీ చూడండి : కరోనా వైరస్ కొమ్మును విరిచే డిజైన్‌తో వ్యాక్సిన్!