గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం వల్ల శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి వద్ద ప్రహరీ గోడ కూలింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతం అమ్రాబాద్ మండలంలో మన్ననూరు వద్ద కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ప్రహరీ గోడ కూలింది.
సహాయక చర్యలు..
మన్ననూర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఈద్గా వద్ద అచ్చంపేట వెళ్లే రోడ్డు వైపు కూలి ప్రమాదంగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల ప్రహరీ సైడ్ గోడ కూలి అడ్డంగా తయారైంది. గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.
అమ్రాబాద్ పోలీస్ బృందం హుటాహుటిన అక్కడకు చేరుకుని వాహనాలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కూలిన చోట రోడ్డుపై రాళ్లను ఉంచి ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పంపిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రహదారి కూలిపోయిన విషయాన్ని సంబంధిత రోడ్డు రవాణా శాఖ అధికారికి తెలియజేసినట్లు అమ్రాబాద్ సీఐ తెలియజేశారు.