తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య, పాడి పరిశ్రమకు ఇస్తున్న అధిక ప్రాధాన్యత రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనితా రాజేంద్ర అన్నారు. రాష్ట్రంలో నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం పెంటోనీ చెరువులో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల రిజర్వాయర్లు, చెరువులలో రూ.50 కోట్ల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను, రూ.10 కోట్లతో 5 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు.
కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన లేగ దూడలను, తెలంగాణ తూర్పు గిత్తల ప్రదర్శనను అనిత రాజేంద్ర తిలకించారు. ప్రభుత్వం గత ఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల పంపిణీ ద్వారా... లబ్ధి పొందిన రైతులతో మాట్లాడారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం మళ్లీ ప్రారంభించాలని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.