రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించడం లేదని, తప్పుడు లెక్కలు చూపిస్తోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. మరణాలను దాస్తూ వాస్తవ లెక్కలను చూపించడం లేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలు చూపే కరోనా పాజిటివ్ లెక్కల ఆధారంగానే ప్రపంచంలో కొవిడ్ లక్షణాలు, వ్యాప్తి, నివారణ, నియంత్రణ, చికిత్సలపై అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు.
మరణానికి కారణం కరోనా కాకపోయినా, కొవిడ్ సోకిన ప్రతీ వ్యక్తి మరణాన్ని నమోదుచేయాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలల్లో స్పష్టంగా ఉందని, వాటిని ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. రోజూ ఎక్కువ సంఖ్యలో కరోనాతో మృతి చెందుతున్నా... కేవలం 10లోపే చూపుతున్నారని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ 50 మృతదేహాలను రహస్యంగా దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. గుట్టు చప్పుడు కాకుండా కరోనా మరణాలను దాయటం, మృతదేహాలను దహనం చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా మరణాల నమోదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'