ఆంధ్ర పాలకులకు వత్తాసు పలికే కొందరు నాయకులు సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. రైతులకు ఉచితవిద్యుత్, రైతుబంధు పథకాలు అమలు ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. ఏడేళ్లుగా అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నామని.. కానీ కొందరు ప్రతిపక్ష నాయకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని మంత్రి కొనియాడారు. ముఖ్యమంత్రిపై అనవసరంగా నోరు పారేసుకున్న నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం 40 లక్షలకు పైగా జనాభాకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తెరాస ప్రభుత్వాదేనని అన్నారు. రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు. ఆయిల్ ఫామ్ మొక్కలపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, జిల్లా కలెక్టర్ టి.ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాలు ఇస్తున్నారా? అన్నదాతలకు అనేక పథకాలు మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నాం. పేదల సంక్షేమం కోసం మేము కృషి చేస్తున్నాం. దాదాపు 40 లక్షల పైగా జనాభాకు పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రం ఏడేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే ప్రతిపక్ష నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉద్యమ సమయంలో లేని నాయకులు ఇప్పుడేమో ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖమంత్రి
ఇదీ చూడండి: Indrakaran reddy: 'దేవుని పేరిట కొత్త పాసుపుస్తకాలు తీసుకోవాలి'