తెలుగు రాష్ట్రాల మధ్య విస్తరించి.. ఎన్నో విశిష్టతలకు నెలవైన నల్లమలలో అరుదైన సర్పం కనిపించింది. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ పరిధిలో తొలిసారిగా ఈ పామును గుర్తించారు. యూరోఫెల్టిడే కుటుంబానికి చెందిన 'యూరోఫెల్టిస్ ఎలియోటి' అనే శాస్త్రీయనామంతో పిలిచే షీల్డ్టైల్ సర్పమని బీట్ అధికారి మధుసూదన్ తెలిపారు.
పాము శరీరంపై ముదురు, గోధుమరంగు, తల, తోకలపై పసుపపచ్చ మచ్చలు ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము అని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ సదాశివయ్య తెలిపారు. కేవలం 25 సెంటీమీటర్ల పొడవుండే ఈ పాములు రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తూ వానపాములను తిని జీవిస్తాయని చెబుతున్నారు. విషరహితమైన ఈ సర్పాలు పక్షులు, అడవిపందులకు ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు. తేమ ప్రాంతాల్లో భూమిలో రంధ్రాలు చేసుకుని జీవిస్తాయని చెప్పారు.