ఎన్నికల సమయం దగ్గర పడగానే రాజకీయ నేతల అడుగులు ప్రధానంగా...ఓటరు జాబితా, రిజర్వేషన్ల అంశం వైపే. గెలుపే లక్ష్యంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవటంలో వీరు దిట్ట. రాష్ట్రంలో పురపోరు ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షనేతలు ఓటరు జాబితాపై అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దానిక తగ్గటుగానే... నాగర్కర్నూల్ ఓటరు జాబితాలోని తప్పులు వారి ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావిస్తున్న కొంతమంది మాజీ నాయకులు బోగస్ ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆ వార్డులో ఎక్కువ మంది ఉంటే రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంటుందని భావించినట్లు సమాచారం.
నాగర్కర్నూల్ పురపాలక సంఘంలోని 24 వార్డుల్లో మొత్తం 30 వేల 99 ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. అందులో 15 వేల 19 మంది పురుషులు... 15 వేల 80 మంది మహిళలు. 20వ వార్డులో ఒకే ఇంటి సంఖ్యతో 53 మంది ఓటర్ల పేర్లను నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా తన ఇంటి సంఖ్యను వాడుకొని బోగస్ ఓట్లు నమోదు చేశారని... వెంటనే వారి పేర్లను తొలగించాలంటూ... ఆ ఇంటి యజమాని శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
ఊళ్లలో ఓట్లు మున్సిపాలిటీల్లో ప్రత్యక్షం...
అదేవిధంగా 108 పోలింగ్ కేంద్రంలో 53 మంది బోగస్ ఓటర్లు నమోదైనట్టు వెలుగులోకి వచ్చింది. వీరంతా తాడూరు మండలం చెర్లయిట్యాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి పేర్లు పురపాలక సంఘంలోని వివిధ ఇంటి సంఖ్యల జాబితాలో నమోదయ్యాయని తెలుస్తోంది. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహులు తమకే అనుకూలంగా ఉండే ఓటర్లను ఆ వార్డులో నమోదు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ చేపట్టిన అధికారులు
ఈ అక్రమాలపై తమకు ఫిర్యాదు అందిందని తహసీల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు. ఒకే ఇంటి సంఖ్యపై 53 మంది ఓటర్ల పేర్లు గత ఎనిమిదేళ్లుగా అలాగే ఓటరు జాబితాలో నమోదై ఉందని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఉపయోగించిన జాబితానే పురపాలక సంఘం వారికి అందించామని తహసీల్దారు చెబుతున్నారు. అధికారుల సమాధానం ఎలా ఉన్నా.. ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి అర్హులతో కొత్త జాబితా తయారు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి;ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు