పని ఒత్తిడిని అధిగమించేందుకు పోలీసులు యోగ శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యంతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి యోగా దోహదం చేస్తుందంటున్నారు గురువు శ్రీ యోగి రాంబాబు. ఈరోజు ఉదయం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పోలీస్‌స్టేషన్ సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బందికి యోగా తరగతులను ఏర్పాటు చేశారు.
మల్లూరుకు చెందిన యోగా గురువు యోగి రాంబాబు సమక్షంలో సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బందికి యోగా నేర్పించారు. ఈ సందర్భంగా ఆయుష్ వారు సూచించిన కొన్ని యోగాసానాలు, ప్రాణాయామం నేర్పించారు. పని ఒత్తిడి తగ్గించేందుకు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపకరిస్తుందని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.