వర్షాకాలం వచ్చిందంటే... చాలు ఎగువన కురుస్తోన్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని పర్యటక ప్రాంతాలు వాజేడు, వెంకటాపురం మండలంలో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. కరోనా వ్యాధి కారణంగా రావద్దని హెచ్చరిక బోర్డు పెట్టినప్పటికి పర్యటకులు వస్తునే ఉన్నారు.
అటవీశాఖతో పరిచయం కలిగిన వ్యక్తులను జలపాతం సందర్శనకు అనుమతిస్తున్నారనే విషయమైనా.. చీకుపల్లిలో ఇటీవల రగడ జరిగింది. జలపాతం సందర్శనకు ఎవరిని అనుమతించవద్దని చీకుపల్లి గ్రామస్థులు ఇటీవల పర్యటకులను జలపాత ప్రదేశాల్లో నిర్బంధించారు. ఈ విషయం పోలీస్‌శాఖకు తలనొప్పిగా మారింది. బొగత జలపాతానికి అధికారులు అనుమతి నిరాకరించినా... ఇతర మార్గాల్లో చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంగాల సమీపంలోని దుసపాటి లొద్ది జలపాతంలో గడిపేందుకు పర్యటకులు వెళ్తున్నారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న పర్యటకులతో... గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా ప్రభావం... పల్లెలపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దుసపాటి లొద్ది జలపాతానికి రావద్దంటూ పర్యటకులను కొంగల గ్రామపంచాయతీ సర్పంచి శివరామకృష్ణరాజు స్థానిక యువకులతో కలిసి ఆదివారం అడ్డుకున్నారు. దీనితో పర్యటకులు ఇతర మార్గాల ద్వారా జలపాతానికి చేరుకుంటున్నారు. పోలీసుల ద్వారా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పర్యటకులను అడ్డుకోలేకపోతున్నమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కరోన నేపథ్యంలో పర్యటకులను అడవిలోనికి అనుమతించకుండా నిషేధించేందుకు అటవీశాఖ ఎటువంటి ప్రయత్నాలు చేపట్టడం లేదని వాపోతున్నారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!