ఏజెన్సీ ప్రాంతాల్లో మాములుగానే రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు తప్పవు. వర్షాకాలంలో అయితే వారి బాధలు వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీ మహిళల వేదన చెప్పలేం. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణుల వేదనకు చలించిన అధికారులు. కాబోయే ఆ తల్లులను కష్టాల నుంచి గట్టెక్కించారు. అందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిని వెంటనే బంధువులు ఆసుపత్రిలో చేర్పించాలనుకున్నారు. కానీ అక్కడి వెళ్లేందుకు గోదావరిని దాటాలి. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఎక్కువగా వస్తోంది. ఇటువంటి స్థితిలో వారికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే వారు అధికారులను సమాచారం ఇచ్చారు. వారు స్పందించి వీరభద్రవరం, పాత్రాపురం మీదుగా గర్భిణులను ట్రాక్టర్, పడవల సహాయంతో గోదావరి ముంపు ప్రవాహాన్ని దాటించి వారిని వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు.