Gudem setting at Tribal Museum: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు రోజురోజుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క- సారలమ్మలను భక్తజనులు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. గిరిజనుల ప్రాచీన జీవన విధానం, వారు నివసించే గూడేలు, స్థితిగతుల విధానాన్ని సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం వద్ద రూపకల్పన చేస్తున్నారు. 2018లో నిర్మించిన ఈ ట్రైబల్ మ్యూజియంలో గిరిజనులు వాడిన పరికరాలను భద్రపరిచారు. డోలీలు, విల్లంబులు, మంచినీరు, ఆనికాయ బుర్రలు, చేపలు పట్టే వలలు, గిరిజన గూడేల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి.. బారసాల తదితర విధానాలను బొమ్మల రూపంలో భద్రపరిచారు. జాతరకు వచ్చే భక్తులు ఈ మ్యూజియంలో ఉన్నవాటిని తిలకిస్తారు.
గూడెం ఏర్పాటు
ఈ ఏడాది.. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం.. గిరిజనులు నివసించే ఊరు, వారి జీవన విధానం, సంప్రదాయాలు, వారి స్థితిగతులను కళ్లకు కట్టేలా గిరిజన మ్యూజియం వద్ద రూపకల్పన చేస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, గూడేలు, పశువుల కొట్టం, పంట పొలాల్లో మాంచ, పైకి ఎక్కే నిచ్చెనను పొందుపరిచారు. అడవిలో దొరికే గుట్టగడ్డి, ఎండుగడ్డి, తాటి కమ్మలు, కర్రలతో ఒక గూడెం నిర్మించారు. పూర్వంలో ఆదివాసీలు ఎలా అయితే గుడిసెలు నిర్మించుకుని జీవించేవారో అలా తయారుచేస్తున్నారు.
"పూర్వం మా గూడెంలో గుడిసెలు ఎలా ఉన్నాయో.. ప్రస్తుత సమాజానికి చూపించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో వనదేవతల గద్దెలను ఏర్పాటు చేసి చుట్టూ గూడేన్ని నిర్మిస్తున్నాం. ఆదివాసీలు వాడిన వస్తువులను, వారి జీవనశైలిని మ్యూజియంలో పొందుపరిచి ప్రజలకు చూపిస్తున్నాం. మేం నిర్మించిన కోయ గ్రామం.. జాతరకు వచ్చే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం." -గిరిజనులు
రూ. 20 లక్షలతో గ్రామం
వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు.. గిరిజన సంస్కృతీసాంప్రదాయాలు తెలియజేసేలా.. గిరిజన సంక్షేమ శాఖ రూ. 20 లక్షలతో గూడెం ఏర్పాటు చేసింది. కొండకోనలు, అడవుల్లో ఆదివాసీలు నివసించే తీరు, వారి జీవన విధానం బాహ్య ప్రపంచానికి సులువుగా అర్థమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మేడారం మహాజాతర.. గిరిజనుల మహా కుంభమేళా..!